పెరుగుతున్న ఉచిత పథకాలు.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..

ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఎన్నికలు వస్తున్నాయంటే.. ఉచిత పథకాల హామీలు ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ.. మేనిఫెస్టోలో చెప్పిన ఉచిత హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న ఉచిత పథకాల పేరుతో జరుగుతున్న పోటాపోటీ రాజకీయాలపై ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలతో జేబులకు భరోసా ఇవ్వడం కాకుండా ప్రజలను శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉచితాలను అమలు చేయడం వ్యయప్రాధాన్యతలను తగ్గించుకోడమే అవుతుందని పేర్కొన్నారు.

 

అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా భారత మండపంలో ఎన్ హెచ్ఆర్సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దీర్ఘ కాలంలో దాని ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చజరగాల్సి ఉందన్నారు. ఉచిత రాజకీయాలు చేయడమంటే కేవలం వ్యయ ప్రాధాన్యతలను వక్రీకరించడమే అవుతుందన్నారు. దిగ్గజ ఆర్థిక నిపుణుల అభిప్రాయాల ప్రకారం.. ఉచితాలనేవి స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని, ప్రాథమిక సూత్రాన్ని బలహీన పరుస్తాయన్నారు. అమృత్ కాల్ సమయంలోనే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా 75వ వార్షికోత్సవాన్ని చేసుకోవడం యాదృచ్ఛికమని జగ్ దీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram