న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల ఆంక్షలు

నగరంలో న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని స్పష్టం చేశారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు.

 

న్యూఇయర్ వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ధం రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఈ మేరకు న్యూఇయర్ మార్గదర్శకాలను జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. ప్రతి ఈవెంట్‌లో సెక్యూరిటీ తప్పనిసరి అని.. సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు.

 

 

సాధారణ పౌరులకు ట్రాఫిక్ లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మద్యం అనుమతించే ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు. వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలకు అనుమతించిన సమయం ముగిసిన తర్వాత లిక్కర్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

 

కాగా, కొత్త సంవత్సర వేడుకలకు నగరం సిద్ధమవుతోంది. పలు పబ్‌లు, హోటల్, రెస్టారెంట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. న్యూఇయర్ వేడుకలను అట్టహాసంగా చేసేందుకు, కస్టమర్లను ఆకర్షించేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అయితే, న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు వాడే అవకాశం ఉండటంతో పోలీసులు నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లోనూ న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram