అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. టీజీ భరత్ ను అనంతపురం జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా నియమించిన నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ఆయన్ని కర్నూలు నగరానికి వెళ్లి కలిశారు. కర్నూలు నగరంలోని మంత్రి కార్యాలయంలో టీజీ భరత్ తో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గంతో పాటు పలు అంశాల గురించి చర్చించారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గుతాయన్నారు. అనంతపురం నగరంలో కూడా మహిళలు ఎక్కువ మంది ఉన్నారని.. వారు పని చేసేందుకు ఉత్సాహాంగా ఉన్నా.. సరైన ఉపాధి లేదన్నారు. అందుకే అనంతపురంకి సమీపంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. వేల మందికి ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి.. చిన్న, సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహాకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి తీసుకొచ్చిన అన్ని అంశాలపై మంత్రి భరత్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అనంతపురం వస్తానని అక్కడ అన్ని అంశాలు చర్చించుకుందామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నియోజకవర్గ పరిశీలకుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
