భద్రాద్రి కొత్తగూడెం
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ, గిరిజనుల డోలి కష్టాలు తీరట్లేదు. జిల్లాల విభజన జరిగి పరిపాలన చేరువైనా.. సరైన రవాణా సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తుండటం గిరిజనులపాలిట శాపంగా మారింది. రహదారి సౌకర్యం లేక డోలీలతోనే గర్భిణులను, బాలింతలను తీసుకెళ్తున్నారు. కొన్ని చోట్ల ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే 10.కి.మీ.లు నడవాల్సిన పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. పినపాక మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామం ఉమేష్ చంద్ర నగర్ కు చెందిన మడవి రామకృష్ణ, భార్య మడవి అడమి బుధవారం తెల్లవారుజామున పురుటి నొప్పులు రాగా రహదారి సౌకర్యం లేక డోలి కట్టి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రసవించింది. సుమారు రెండు కిలోమీటర్లు జడ్డి కట్టి ప్రయాణించాక అక్కడి నుంచి108 వాహనంలో జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు..