తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతం కోసం మరిన్ని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మహిళలకు కొత్త అవకాశాలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం:
పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, మహిళలకు ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడం కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మహిళల కోసం ప్రత్యేక పథకం:
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఈ విషయమిలో మరింత చురుకుగా వ్యవహరిస్తోంది. మహిళలకు ఆటో డ్రైవింగ్ నేర్పించి, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించేందుకు కొత్త పథకాన్ని రూపొందిస్తోంది. ఆటోల కొనుగోలుకు అయ్యే ఖర్చులో సగం మొత్తాన్ని ప్రభుత్వం భరించనుంది.
డ్రైవింగ్ శిక్షణ:
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఇప్పటికే కొంతమంది మహిళలకు ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నారు. ఎలక్ట్రిక్ ఆటోల నిర్వహణ సులభమైనదని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలో వినూత్న పథకం:
సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారని సమాచారం. ఈ పథకం అమలులోకి వస్తే, రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇది కీలకంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.