బాలికకు పాము కాటు – ఆధార్‌ లేదని ఆసుపత్రికి తీసుకెళ్లని 108 సిబ్బంది. 

ఆధార్ కార్డు లేకపోవడంతో పాము కాటుకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించేందుకు నిరాకరించిన అంబులెన్స్‌ సిబ్బంది – అక్కడికక్కడే బాలిక మృతి

 గోల్డెన్ న్యూస్/ వికారాబాద్ : జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం సంచార జాతికి చెందిన బుడగ జంగం సంగీత, దివ్యాంగురాలైన ఆమె తల్లి రంగమ్మలు భిక్షాటన, కూలీ పనులు చేస్తూ గ్రామంలోని ఓ పాత భవనంలో నివాసం ఉంటున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి 10 గంటల సమయం భోజనం చేసి పక్కనే ఉన్న గోడ మీద సంగీత చేయిని పెట్టింది. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు కానీ పాము ఆమెను కాటేసింది. ఆమె పెద్దగా అరిచి తల్లికి చెప్పడంతో చుట్టుపక్కల వారి సాయంతో 108 సమాచారమిచ్చారు. అంబులెన్స్ 10.30 గంటలకు వచ్చింది. తల్లి వెంట రాగా, సంగీతను కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తాండూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా పరిస్థితి కుదుటపడక పోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో రంగమ్మ స్థానికుల సహాయంతో మరో 108 అంబులెన్సుకు సమాచారం ఇవ్వగా, దాదాపు గంట తరువాత అంబులెన్స్ వచ్చింది. కానీ బాలికకు ఆధార్‌ కార్డు లేదని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ సిబ్బంది నిరాకరించారు. ఫలితంగా ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌ ప్రభుత్వాసుపత్రుల్లో ఆధార్‌ కార్డు లేనిదే చేర్చుకోరని 108 సిబ్బంది ఆమెకు చెప్పారు. పాము కాటుకు గురైందని తెలియగానే ఆత్రుతతో వచ్చినందున కార్డు తీసుకు రాలేదని చెప్పగా, అది తెస్తే అంబులెన్సులో తీసుకెళ్తామంటూ సిబ్బంది కొద్దిసేపు వేచి చూశారు. స్థానికులు నచ్చజెప్పినా సిబ్బంది అసలు పట్టించుకోలేదు. ఇలా ఆలస్యం చేయడంతో  సంగీత పరిస్థితి విషమించి అక్కడే ప్రాణాలు వదిలింది. తన బిడ్డ మరణానికి అంబులెన్సు సిబ్బందే కారణమంటూ రంగమ్మ బోరున విలపించింది..

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram