ప్రైవేటుకు ఇవ్వడంపై ప్రభుత్వం ఆగ్రహం
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : భద్రాచలం ఆలయంలో వినియోగించే నెయ్యిని ప్రైవేటు సంస్థ నుంచి కొనుగోలు చేస్తుండటం పై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ రైతు డెయిరీకి ఇచ్చిన టెండర్ను తక్షణం రద్దు చేయాలని దేవాదాయశాఖ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆలయ ఈవోను ఆదేశించింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. అసెంబ్లీలో తనను కలిసిన శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్లతో ఈ విషయంపై చర్చించారు. ఆలయం ఈవో రమాదేవిని సస్పెండ్ చేయాలని ఆదేశించినప్పటికీ ఆమె రెవెన్యూశాఖ అధికారి కావడంతో నేరుగా సస్పెన్షన్ సాధ్యం కాదని ఉన్నతాధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఛార్జి మెమో జారీ చేయడంతోపాటు ఈవో బాధ్యతల నుంచి తప్పించి మాతృశాఖకు పంపాలని మంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. దేవుడి ప్రసాదాల విషయంలో నిర్లక్ష్యం వహించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ అంశం పై ఈవో ఇప్పటికే వివరణ ఇచ్చినట్లు తెలిసింది.