గోల్డెన్ న్యూస్/పినపాక :మండలంలోని ఐలాపురం ప్రభుత్వ, గిరిజన బాలికల పాఠశాలలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయుల పనితీరును విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు. హాస్టల్లో తయారు చేసిన వంటకాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించాలని, దీంట్లో రాజీ పడేందుకు వీలు లేదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూను పాటిస్తూ విద్యార్థులకు సక్రమంగా భోజనం అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు పాటించాలని, నాణ్యతతో కూడిన గుణాత్మక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.