గుండెపోటు రోగిని మార్గ మధ్యలో దించేసిన వెళ్లిన ఆంబులెన్స్ డ్రైవర్- భూపాలపల్లి జిల్లాలో ఘటన. బంధువుల కారులో ఆసుపత్రికి తరలించిన వైనం – ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన రోగి.- బాధితుని కుటుంబ సభ్యులు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు
గోల్డెన్ న్యూస్/ భూపాలపల్లి : ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించాల్సిన 108 వాహన డ్రైవర్ తమ పరిధి కాదంటూ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మార్గ మధ్యలోనే దింపేసిన ఘటన భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.. మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన శనిగరం బాపురెడ్డి అనే వ్యక్తికి శనివారం గుండె పోటు వచ్చింది. కుటుంబసభ్యులు వెంటనే మహదేవపూర్లోని ఓ ఆసుపత్రికి తరలించగా. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు.. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. అందుబాటులో లేదని తెలియడంతో రోగి సమీప బంధువైన మహదేవపూర్ ప్యాక్స్ ఛైర్మన్ చల్ల తిరుపతి బాపురెడ్డిని తన కారులో ఎక్కించుకుని ఎంజీఎం కు బయలుదేరారు.. కారులో ఆక్సిజన్ సౌకర్యం లేక, గుండెనొప్పితో తీవ్రంగా అస్వస్థతకు గురవుతున్న బాపురెడ్డిని చూసి చలించిపోయిన కుటుంబసభ్యులు మరోమారు అంబులెన్స్కు ఫోన్ చేశారు. భూపాలపల్లి సమీపంలోకి వచ్చాక 108 వాహనం రావడంతో రోగిని అందులోకి మార్చారు. సిబ్బంది అతడికి ఆక్సిజన్ పెడుతూ కొద్ది దూరం తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలంటూ బంధువులు డ్రైవర్ కు సూచించారు. అయితే తమ పరిధి భూపాలపల్లి వరకేనంటూ వారిని జిల్లా పాలనాధికారి సముదాయాల గేటు రోడ్డుపైనే దింపేసి డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేమీ లేక తిరుపతి మళ్లీ తన కారులోనే రోగిని ఎక్కించుకుని వరంగల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా, ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి క్షేమంగా బయటపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఘటనకు బాధ్యులుగా చేస్తూ 108 జిల్లా మేనేజర్, వాహన డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలంటూ ప్యాక్స్ ఛైర్మన్ తిరుపతి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పాలనాధికారి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఎందుకు ఇలా చేశారంటూ అంబులెన్స్ డ్రైవర్‌ను నిలదీస్తే, తమ పరిధి ఇక్కడి వరకేనని, వరంగల్ వెళ్లొద్దని తమ జిల్లా మేనేజర్ చెప్పారని చెప్పినట్లు వెల్లడించారు..