ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తప్పవు.
గోల్డ్ న్యూస్/ హైదరాబాద్ : సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవపట్టించే పోస్టులను గుర్తించిన పోలీసులు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజాగా, మరో సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫుటేజ్‌లో, అల్లు అర్జున్ థియేటర్‌లోకి రాకముందే అపస్మారక స్థితిలో ఉన్న రేవతిని బయటకు తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది. ఈ అంశాన్ని అభిమానులు, నెటిజన్లు తెరపైకి తీసుకురావడంతో, ఘటనపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.
అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు వాదన చేయగా, ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ పోలీసులు హెచ్చరికను జారీ చేశారు.పోలీసుల హెచ్చరిక ఈ విధంగా ఉన్నాయి. సంధ్య థియేటర్ ఘటనపై తప్పుడు సమాచారం లేదా అపోహలు కలిగించేలా ఎడిటింగ్ వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..