విద్యార్థుల ఫీజులకు కళ్లెం పడేనా…?

ప్రైవేటు బడులు, కళాశాలల్లో ఇష్టారాజ్యంగా వసూళ్లునియంత్రణ – చర్యలు చేపడతామన్న మంత్రివర్గ –  ఉపసంఘంఇంకా మొదలవని కార్యాచరణ

ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజులను నిర్ణయించడం, నియంత్రించడంపై కమిటీని నియమించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

 

మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్రంలో బీటెక్‌ కంటే కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎల్‌కేజీ ఫీజు అధికంగా ఉంది. ఈ భారంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.నియంత్రణ లేకపోతే ఎలా?

మంత్రి సీతక్క ఆవేదన

రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సెప్టెంబరు 11న శ్రీధర్‌బాబు ఛైర్మన్‌గా ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం తొలి సమావేశంలో మంత్రుల వ్యాఖ్యలివి. సమావేశం జరిగి మూడున్నర నెలలు గడిచినా ఇప్పటివరకు మరో భేటీ జరగలేదు. కమిటీ ఏర్పాటుకాలేదు. కొత్త విద్యా సంవత్సరం(2025-26) జూన్‌ రెండో వారంలో ప్రారంభమవుతుంది. అంటే ఫీజులను నిర్ధారించేందుకు అయిదు నెలలు మాత్రమే గడువు ఉంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల పరిధిలో ఇప్పటికే ప్రవేశాలు మొదలయ్యాయి. ఫీజుల కట్టడి దిశగా చర్యలు చేపట్టకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

సుప్రీం తీర్పుతో మొదలు..

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ట్యూషన్‌ ఫీజులు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, యాజమాన్యాలు ఏటా సగటున 10-15 శాతం పెంచుకుంటూ పోతుండటంతో ప్రధానంగా చిరుద్యోగులు, మధ్య తరగతికి పెనుభారంగా మారాయి. జీఓ 91 ప్రకారం కలెక్టర్లు ఛైర్మన్‌గా ఉండే డీఎఫ్‌ఆర్‌సీ(జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీ)లకు నియంత్రించే అధికారం ఉందని గతంలో భావించే వారు. అయితే డీఎఫ్‌ఆర్‌సీలకు ఆ అధికారం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కమిటీలకు మాత్రమే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు 2016 సెప్టెంబరు 19న తీర్పునిచ్చింది.

2017లో తిరుపతిరావు కమిటీ

ఈ నేపథ్యంలో గత భారాస ప్రభుత్వం ఆచార్య తిరుపతిరావు ఛైర్మన్‌గా ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ 2017 డిసెంబరులో నివేదిక ఇచ్చింది. 10 శాతానికి మించకుండా ఏటా ఫీజులు పెంచుకోవచ్చని ఆ కమిటీ పేర్కొన్నట్టు..ఆ క్రమంలో కొన్ని షరతులూ విధించినట్టు సమాచారం. అయితే ఆ నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు. నిర్ణయమూ తీసుకోలేదు. అప్పటి నుంచి వ్యవహారం ముందుకూ కదల్లేదు. అటు తర్వాత పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని భారాస ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో మంత్రివర్గ ఉప ఉపసంఘాన్ని నియమించింది. ఆ కమిటీ కూడా 10 శాతం వరకు ఏటా పెంచుకోవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ..దానిపై సర్కారు నిర్ణయాన్ని ప్రకటించలేదు.

ఈ ఏడాది మే 18వ తేదీన ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల సందర్భంగా అప్పటి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు.

తర్వాత ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఫీజుల కట్టడికి కమిటీని ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఆ విషయాన్ని సెప్టెంబరు 30న డీఎస్‌సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా పునరుద్ఘాటించారు. ఇప్పటివరకు దానిపై కార్యాచరణ మాత్రం కనిపించలేదు.

ఏటా 15 శాతం పెంపునకు అనుమతివ్వాలంటున్న ట్రస్మా

ప్రైవేట్‌ పాఠశాలల్లో ట్యూషన్‌ ఫీజులను ఏటా 15 శాతం పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) తాజాగా విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళికి విన్నవించింది. పాఠశాలల నోటీసు బోర్డులో పొందుపరిచిన ఫీజులను వసూలు చేసుకునేలా ‘రైట్‌ టూ ఫీజు కలెక్షన్‌(ఆర్‌ఎఫ్‌సీ)’ను తీసుకురావాలనీ కోరింది. ట్రస్మా కోరినట్లుగా ఏటా 15 శాతం పెంచితే అయిదు సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందన్న మాట. ఉదాహరణకు ఓ విద్యార్థి రూ.20 వేల ఫీజుతో ఒకటో తరగతిలో చేరితే ఆరో తరగతిలో రూ.40 వేలు చెల్లించాల్సి వస్తుంది. పదో తరగతి నాటికి సుమారు రూ.70 వేలు దాటుతుంది.

ప్రభుత్వం స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తాం: హెచ్‌ఎస్‌పీఏ

హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ) సంయుక్త కార్యదర్శి వెంకట్‌ మాట్లాడుతూ, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని త్వరలో ప్రభుత్వానికి వినతిపత్రం అందజేస్తామన్నారు. ఆ తర్వాత కూడా స్పందించకపోతే న్యాయస్థానంలోనే పోరాడతామని స్పష్టంచేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram