లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశం..

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్దిదారుల జాబితాను ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించే గ్రామసభల్లో ఆమోదం పొందాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ఈనెల 26వ తేదీన ప్రారంభించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తగిన కార్యాచరణ చేపట్టేందుకు జిల్లా కలెక్టర్లతో సీఎస్ బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ ఈ నాలుగు ప్రతిష్టాత్మక పథకాలకు లబ్దిదారుల ఎంపికలో ఏవిధమైన అపోహలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. ఈ పథకాలన్నీ నిజమైన అర్హులకే దక్కేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు భరోసాకు సంబంధించి భూముల వివరాలను రెవెన్యూ శాఖ ద్వారా వ్యవసాయ శాఖకు పంపినట్టు తెలిపారు. సాగుయోగ్యం కాని భూములను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు.

గ్రామసభల్లో వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలు స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకుగాను ఉపాధిహామీ చట్టంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాల జాబితాను గ్రామసభల్లో ప్రకటించి ఆమోదం పొందాలని సీఎస్ తెలిపారు. రేషన్కార్డుల మంజూరుకు రూపొందించిన లబ్దిదారుల ముసాయిదా జాబితా గ్రామసభల్లో ఆమోదం పొందాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ఆదేశాలకు అనుగుణంగా లబ్దిదారుల ముసాయిదా జాబితాను గ్రామాలలో ప్రదర్శించాలని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాలలో, గ్రామపంచాయతీల వారిగా, పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారిగా సభలు నిర్వహించాలని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో లబ్దిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లబ్దిదారుల జాబితా ఎంపిక, డాటా ఎంట్రీ, క్షేత్ర స్థాయి పరిశీలన తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించారు. ఇప్పటివరకు, ఈ నాలుగు పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన, ప్రత్యేక బందాల ఏర్పాటు, ముసాయిదా జాబితా తయారీ, డేటా ఎంట్రీ ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు చేసిన ప్రత్యేక కృషిని సీఎస్ అభినందించారు. ఈ నాలుగు పథకాల అమలుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సంబంధిత కార్యదర్శులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, గహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధప్రకాష్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్తోపాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram