మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తించేందుకు రూపకల్పన..
– ఈ నెల 21 నుంచి గ్రామసభల్లో ప్రదర్శన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో భాగంగా మొదటి విడతలో సొంత స్థలం ఉండి పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరి ఇళ్లకు వెళ్లి అధికారులు ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో నమోదు చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా ప్రతి దరఖాస్తును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. యాప్ సర్వేలు అర్హులేనని తేలినప్పుటికీ సమగ్ర కుటుంబ సర్వేలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు, ఇతర ప్రాంతంలో ఇల్లు, కారు ఉన్నట్లు వెల్లడైతే ఆ దరఖాస్తును పక్కన పెట్టేస్తారు. మొదటి విడతలో సొంత స్థలం ఉండి నిరుపేదలైనా వారికే ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వం వద్ద ఉన్న ఇతర వివరాలతోనూ. పూర్తిస్థాయిలో సర్వే చేపట్టనున్నారు. పూర్తి వడపోత తర్వాత ఈ నెల 18న అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 21 నుంచి ఏర్పాటు చేసే గ్రామసభల్లో ఈ జాబితాను ప్రదర్శించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. కాగా ఈ నెల 26లోగా ఈ ప్రక్రియ పూర్తికానుంది.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామాలు, పట్టణాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని కేటాయించాలనే దానిపై అధికారులు కసర్తతు చేస్తున్నారు. మొత్తం 3,500 ఇళ్లలో గ్రామాలు, పట్టణాల వారీగా మంజూరు చేసిన వాటి వివరాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రికి అందజేస్తారు. ఆయన ఆమోదం ఆనంతరం ఎన్ని ఇల్లు మంజూరయ్యాయో ఆ వివరాలు గ్రామసభల్లో ప్రదర్శిస్తారు. ఎంపికలో అతిపేదలు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి.
హైదరాబాద్ మినహా రాష్ట్రంలో గురువారం వరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వే 97శాతం పూర్తయింది. 32 జిల్లాల్లో 69,83,895 దరఖాస్తులు ఉండగా 68,08,923 దరఖాస్తులను సర్వే చేశారు.
సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో 100శాతం, భద్రాద్రి కొత్తగూడె, నల్గొండ, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో 99 శాతం, మహబూబ్నగర్, మహబూబాబాద్, పెద్దపల్లి, వనపర్తి, జగిత్యాల, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 98శాతం సర్వే పూర్తయింది. మిగతా జిల్లాల్లోనూ 100శాతం పూర్తి చేసి ఈ నెల 18న అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు.









