బీజాపూర్ జిల్లాలోని గంగలూరు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతి
శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కోసం భద్రతా దళాలు, పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం శుక్రవారం రోజునే గంగలూర్ అడవుల్లోకి ప్రవేశించింది. మావోయిస్టుల స్థావరాలను గుర్తించేందుకు దాదాపు ఒక రోజంతా అడవులను జల్లెడ పట్టింది. ఈక్రమంలోనే శనివారం ఉదయం తారసపడిన మావోయిస్టులు, భద్రతా బలగాలపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ప్రతి కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు.
స్పష్టమైన సమాచారంతోనే!
మావోయిస్టుల పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యకర్తలు గంగలూర్ అడవుల్లో ఉన్నట్లు పోలీసులకు స్పష్టమైన సమాచారం అందింది. దాని ఆధారంగానే ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఇందులో జిల్లా రిజర్వ్ గార్డ్ సిబ్బంది, పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ సిబ్బంది, కోబ్రా సిబ్బంది పాల్గొన్నట్లు వెల్లడించారు.