రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు

–  రోడ్ల నిర్మాణంలో అధికారుల పర్యవేక్షణ కరువు.

– సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

గోల్డెన్ న్యూస్/కరకగూడెం: ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల ప్రజల రహదారి సౌకర్యం మెరుగుపరిచేందుకు  సీసీ రోడ్లు  నిర్మిస్తుండగా పనుల్లో నాణ్యత పాటించడం  లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత అధికారులు తమ బాధ్యతలను  నిర్వర్తించడంలో విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పలు గ్రామాలకు నూతనంగా సీసీ రోడ్లు మంజూరయ్యాయి. ఈ క్రమంలో చొప్పల గ్రామంలో మంగళవారం ప్రారంభమయిన సీసీ రోడ్డు నిర్మాణ పనులలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఏదైనా పని జరిగేటప్పుడు అనుభవజ్ఞులైన ఇంజనీర్లు, సూపర్వైజర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరగాలి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా కార్మికులే అన్ని తామై పనులు చేస్తుండటం  కోసం మెరుపు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇస్తానుసారంగా సీసీ రోడ్లు నిర్మిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాలలో సీసీ రోడ్లు వేసి క్యూరింగ్ చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో పది కాలాలపాటు ఉండవలసిన సిసి రోడ్లు ముచ్చటగానే ఉంటాయని చర్చించుకుంటున్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యే  అవకాశం లేక పోలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి, పాలకులకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు నిర్మాణ పనులు నిర్ణీత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకుపోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఏఈ వెంకటేశ్వరరావు వివరణ..

సంబంధిత శాఖ పంచాయితీ రాజ్ ఏఈ వెంకటేశ్వర్లును వివరణ కోరగా పనులు నాణ్యతగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాంమని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని  సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించామన్నారు. అన్ని నియమ, నిబంధనలు వివరించామని తెలిపారు.  ఇతరత్రా పనుల వల్ల కొన్ని సందర్భాల్లో పనులు జరుగుతున్న చోట ఉండలేమని ఎవరైనా పనులలో  నాణ్యతలు పాటించకుంటే  సీసీ రోడ్డు కోర్ కటింగ్ ద్వార గుర్తిస్తామని బదులిచ్చారు.

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram