న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచితాల వల్ల ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని అసహనం వ్యక్తం చేసింది. తద్వారా వారు నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన వ్యక్తులకు ఆశ్రయం కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిష్లలతో కూడిన దిసభ్య ధర్మాసనం బుధవారం (ఫిబ్రవరి 12) ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది .విచారణ సందర్భంగా ఎన్నికలకు ముందకు వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలపై ధర్మాసనం హాట్ కామెంట్స్ చేసింది.దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు హామీ ఇస్తున్న ఈ ఉచితాల కారణంగా ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు. ఎటువంటి పని చేయకుండానే వారికి రేషన్, డబ్బు అందుతున్నాయి. ఫ్రీగా రేషన్, డబ్బు రావడంతో వారు పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. వారిపై మీకున్న శ్రద్ధను మేము అభినందిస్తున్నాము. కానీ వారిని సమాజంలోని ప్రధాన స్రవంతిలో భాగం చేసి దేశాభివృద్ధికి దోహదపడేలా చేయడం మంచిది కదా అని ధర్మాసనం పేర్కొంది.
