కేంద్ర ఆరోగ్య పథకంలో కీలక మార్పులు..
కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో ఇప్పటికే ఆరోగ్య శ్రీ తరహాలో కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. దీని పేరు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై). ఇప్పటికే చాలా మందికి ఈ పథకం గురించి అవగాహన ఉంది. అందరికీ ఆయుష్మాన్ భారత్ అంటే అర్థం అవుతుంది. ఇది అత్యంత సమగ్రమైన ఆరోగ్య బీమా పథకాలలో ఒకటి. వైద్య చికిత్సకు అయ్యే అధిక ఖర్చుల నుంచి ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు రక్షణ కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా ప్రత్యేకమైన కార్డులను అందిస్తోంది. దీనిలో ఎప్పటికప్పుడు ఆయుష్మాన్ కార్డును అప్ డేట్ చేస్తోంది. కవరేజ్ పరిధిని పెంచుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 11వ తేదీన ఈ పథకాన్ని మరింత మంది వినియోగించుకునేలా విస్తరించింది. కేంద్ర మంత్రి వర్గం దీనికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం, 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఆరోగ్య కవరేజీ లభిస్తుంది. 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్‌లతో సహా దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు.. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని అందుతుంది. ప్రతి సీనియర్ సిటిజన్ వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా పథకం ప్రయోజనాలను పొందగలుగుతారు.