ముస్లింలను తొలగించి బీసీ జాబితా పంపితే ఆమోదించే బాధ్యత మాదే’’ – కేంద్రమంత్రి బండి సంజయ్

మోడీ కులం, రాహుల్‌ మతంపై చర్చకు సిద్ధం.

ఎనిమీ ఆస్తుల అమ్మకానికి సిద్ధం.

 కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు.

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : బీసీ జాబితా నుంచి ముస్లింలను తప్పిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ విషయం తెలిసికూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం నాటకాలు ఆడుతుందని విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ కులం, రాహుల్‌ గాంధీ మతంపై చర్చకు తాము సిద్ధమనీ, ఇదే అంశాన్ని రెఫరెండంగా భావిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్దామా అని కాంగ్రెస్‌ పార్టీకి సవాల్‌ విసిరారు. కుల గణన తప్పుల తడక, బీసీ జాబితాలో ముస్లింలను కలపడంపట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధాని కులంపై సీఎం రేవంత్‌రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. శనివారంనాడిక్కడి టూరిజం ప్లాజాలో ఎనిమీ ప్రాపర్టీస్‌ (శత్రు ఆస్తులు)పై కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, కొత్తగూడెం, వికారాబాద్‌ జిల్లాల్లోని ఎనిమీ ప్రాపర్టీస్‌ (శత్రు ఆస్తులు) ఉన్నాయనీ, వాటిలో చాలా ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయనీ, వాటిని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలనే అంశంపై అధికారులతో చర్చించామనీ, దానిపై నివేదికను కోరినట్టు తెలిపారు. గతంలో పాకిస్తాన్‌తో యుద్ధం సందర్బంగా ఇండియా నుంచి పాకిస్తాన్‌ వెళ్లిన ప్రజలు, ఇక్కడ తమ ఆస్తులను వదిలేసి వెళ్లారనీ, పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు వచ్చిన వాళ్లు అక్కడ తమ ఆస్తులను వదిలేశారని చెప్పారు. అయితే పాకిస్తాన్‌ ఆస్తుల ఒప్పందాన్ని ఉల్లంఘించి అమ్మేసుకుందనీ, ఈ నేపథ్యంలో దేశంలోని ఎనిమీ ప్రాపర్టీస్‌ను అమ్మేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఎనిమీ ప్రాపర్టీస్‌ ఉన్నాయనీ, మార్చి నెలాఖరులోపు ఆయా ఆస్తులకు సంబంధించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మోడీ ముమ్మాటికీ బీసీనే అనీ, 1994లో గుజరాత్‌లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మోడీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చిందని వివరించారు. మోడీ కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలకు మంత్రిపదవులు ఇచ్చారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఎంత మంది బీసీ మంత్రులు ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ హయాంలో సర్వేచేస్తే 51 శాతం బీసీలు ఉన్నారని తేలిందనీ, ఇప్పుడు కుల గుణన సర్వేలో 46 శాతానికి ఎలా తగ్గిందని అడిగారు. రాహుల్‌ గాంధీ కులం, మతం, జాతి గురించి చర్చ జరగాలనీ, రాహుల్‌ గాంధీ తాత ఫిరోజ్‌ ఖాన్‌ అనీ, రాహుల్‌ తల్లి సోనియాగాంధీ క్రిస్టియన్‌, ఇటలీ దేశస్తురాలనీ, మరి రాహుల్‌ ఏ కులమని ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు..

Facebook
WhatsApp
Twitter
Telegram