భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ గా జ్ఞానేశ్వర్ కుమార్

గోల్డెన్ న్యూస్/న్యూఢిల్లీ, : భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్ (61) నియమితులయ్యారు. ఎన్నికల కమిషనర్‌ (ఈసీ)గా వివేక్‌ జోషిని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య సెలక్షన్‌ కమిటీ ఖరారు చేసింది.

 

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్‌ (ఈసీ) పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఈ నోటిఫికేషన్లలో వెల్లడించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ నేతృత్వంలోని సెర్చ్‌ కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితాలో జ్ఞానేశ్‌ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎంపిక చేశారు.

 

దీంతో సెలక్షన్‌ కమిటీ ఖరారు చేసిన నూతన సీఈసీని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అనంతరం సోమవారం రాత్రి భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

 

19న జ్ఞానేశ్‌ కుమార్‌ సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ ఈ పదవిలో 2029 జనవరి 26 దాకా కొనసాగుతారు.

 

జ్ఞానేశ కుమార్‌ కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఈయన 2024 మార్చిలో ఎన్నికల కమిషనర్‌ (ఈసీ)గా నియమితులయ్యారు. కొత్త సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పర్యవేక్షణలోనే బిహార్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జ్ఞానేశ్‌ కుమార్ కేంద్ర హోంశాఖలో పని చేస్తున్న సమయంలో ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram