గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం :ఈ నెల 27న జరిగే శాసన మండలి ఎన్నికల పోలింగ్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లాలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను మొత్తం 2022 మంది ఓటర్లు కాగా అందులో పురుషులు 1068 మంది మహిళలు 954 మంది ఉన్నారని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు అందరూ 100% తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. 23 మండలాలకు గాను పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. బుధవారం కొత్తగూడెం శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల నందు ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి సామాగ్రిని తీసుకొని అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు , విద్యుత్ లైట్లు మరియు ఫ్యాన్లు ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్లను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలోకి ఓటర్లను ఓటర్ రికగ్నైజేషన్ సెంటర్ ద్వారా నిశితంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం అత్యవసర వైద్య సహాయం అందించేందుకుగాను అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ అనంతరం అధికారులు పోలింగ్ సామాగ్రిని నిర్దేశిత పద్ధతి ప్రకారమే ప్యాకింగ్ చేసి నేరుగా నల్గొండ రిసెప్షన్ సెంటర్ కు చేరవేయాలి అన్నారు. నల్గొండ రిసెప్షన్ సెంటర్లో ఎవరికైతే డ్యూటీ వేసిన అధికారులు 27వ తారీకు ఉదయమే అక్కడికి చేరుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల లోపు ఎవరిని అనుమతించరాదని, బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఎలక్షన్ సూపర్డెంట్ ధారా ప్రసాద్, ఎన్ఐసి అధికారి సుశీల్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
