అది మట్టి రోడ్డు అయినా టోల్ ఛార్జీ కట్టాల్సిందే – బైకుకు మినహాయింపు ఉండదు.

అది మట్టి రోడ్డు అటు వెళితే టోల్ ఛార్జీ కట్టాల్సిందే – బైక్లకూ మినహాయింపు ఉండదు.

గోల్డెన్ న్యూస్/ జయశంకర్ భూపాలపల్లి : సాధారణంగా జాతీయ రహదారులపై టోల్ గేట్లు చూస్తుంటాం. నాణ్యమైన, గుంతలు లేని రోడ్డుని ఉపయోగించి మనం సాఫీగా ప్రయాణించేందుకు టోల్ చెల్లిస్తాం. అయితే, అసలు అనుమతే లేని మట్టి రోడ్డుకు మీరు టోల్  ట్యాక్స్ చెల్లించాల్సిందే ! ఇక్కడ మాత్రం రోజుకు వందలాది వాహనాల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి పనులు వివిధ ఆటంకాలతో ఆగిపోతుండటంతో పక్కనే మట్టి రోడ్డు వేసిన అక్రమార్కులు టోల్ దందాకు తెరలేపారు.ఈ మానేరు వాగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి, పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామాల మధ్య ఉంది. ఇక్కడి వాహనదారుల కోసం 9 ఏళ్ల క్రితం నాటి సర్కార్ రూ.51 కోట్లతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నిధులు త్వరగానే విడుదల కావడంతో పనులు సైతం చకచకా జరిగాయి. అయితే గతేడాది కురిసిన వర్షాలు, వరదలతో వంతెన తాలుకూ 8 గడ్డర్లు కుప్పకూలాయి. దీంతో పనులూ నిలిచిపోయాయి. నాసిరకం పనులే కారణమని భావించిన సర్కార్, సదరు కాంట్రాక్టర్కు ఉద్వాసన చెప్పి మళ్లీ టెండర్లు పిలిచింది. 5.20 కోట్లతో టెండర్లు దక్కించుకున్న మరో కంపెనీ సైతం ఇంకా పనులు ప్రారంభించలేదు. దీన్నే ఆసరాగా తీసుకున్న అక్రమార్కులు వాగులో మట్టిరోడ్డేసి వసూళ్లకు పాల్పడుతున్నారు.

వాహనదారులు ప్రశ్నించినా నో యూజ్ :

వరంగల్, హనుమకొండ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఇది దగ్గరి దారి కావడంతో రోజూ వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా మట్టి రోడ్డు నిర్మించిన అక్రమార్కులు, దానిపై టోల్ వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.80 వేల నుంచి రూ. లక్ష వరకు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5.50 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఇదేమని ప్రశ్నించిన వారిని ఆ దారిపై వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మానేరు వాగుపై నిర్మించిన మట్టి రోడ్డుకు టోల్ వసూలు చేయడమేంటని వాహనాదారులు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. టేకుమట్ల మండలానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో దందా వెలుగులో వచ్చింది.

ఆశ్చర్యం కలిగిస్తున్న తహసీల్దార్ మాటలు

మానేరు వాగుపై ఈ దారి నిర్మాణానికి అనుమతులు లేవని టేకుమట్ల తహసీల్దార్ వెల్లడించారు. అక్రమంగా వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. వాహనదారులపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే తమకు ఫిర్యాదు చేయాలని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram