నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతలు మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలో నివాసముంటోంది. ఈ క్రమంలో వరుసకు మరిదయ్యే రాము అనే వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధ ఏర్పడింది. తరచూ ఇంటికి వస్తూ తల్లిని వలలో వేసుకున్న ఆ కామాంధుడు.. ఆమె కూతురిపై కూడా కన్నేశాడు. ఈడొచ్చిన ఆ బాలిను ఎలాగైనా వశపరుచుకోవాలని అనుకున్నాడు. ఆ దుర్మార్గుపు ఆలోచనకు తల్లి కూడా సహకారం అందించింది.
ఈ నేపథ్యంలోనే తల్లి ప్రోద్బలంతో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి బాలిక గర్భం దాల్చింది. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక.. తన అమ్మమ్మకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. బాలిక గర్భవతి అయిన విషయం ఎవరికి చెప్పకుండా.. గుట్టుచప్పుడు కాకుండా తొర్రూరులోని అమ్మ ప్రైవేట్ హాస్పిటల్‌లో అబార్షన్ చేయించింది అమ్మమ్మ. అయితే బాలికకు అబార్షన్ జరిగిన విషయంపై చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అధికారులు విచారణ చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రియుడితో కలిసి తల్లి చేసిన దారుణం గురించి తెలిసి షాక్‌కు గురయ్యారు. అబార్షన్ నిర్వహించిన ఆసుపత్రితోపాటు కామాంధుడు రాము.. ఆ దుర్మార్గుడికి సహకరించిన బాలిక తల్లిపై తొర్రూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలిక చెప్పిన విషయాలను రికార్డు చేశామని జిల్లా అడిషనల్ సీడీపీఓ విజయలక్ష్మీ తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించామని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు.