గోల్డెన్ న్యూస్ / వర్ధన్నపేట: సాయం చేస్తానని నమ్మించి గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి దగ్గర ఉన్న నగదు ఎత్తుకెళ్లిన ఘటన వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితురాలు కథనం ప్రకారం.. వర్ధన్నపేట సమీపంలోని ఫిరంగిగడ్డకు చెందిన నందనం భారతమ్మ బుధవారం స్థానిక ఎస్బీఐకి వెళ్లి తన ఖాతాలో ఉన్న నగదుతో పాటు వ్యక్తిగత రుణం మొత్తం రూ.3 లక్షలు తీసుకుంది. సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెతో మాట కలిపాడు. నేను ఫిరంగి గడ్డ వైపు వెళుతున్నానని నమ్మించి భారతమ్మ. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. నగదు సంచి తీసుకొని ముందు పెట్టుకున్నాడు. ఆమె ఇల్లు వచ్చినా వాహనం నిలపకుండా వెళ్తుండడంతో ఆమె కేకలు వేసింది. దీంతో ఆమెను వాహనం నుంచి దింపి, రూ.3 లక్షలు, బ్యాంక్ ఖాతా పుస్తకం ఉన్న సంచితో పారిపోయాడు. వెనుక వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయన్ను వెంబడించారు. వేగంగా ఐనవోలు వైపు వెళ్లినట్లు వారు తెలిపారు. పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. వృద్ధురాలిని బ్యాంకులోనే గమనించి చోరీకి స్కెచ్ వేసినట్లు అంచనా వేస్తున్నారు.
