గోల్డెన్ న్యూస్ / సిరిసిల్ల : శ్రీరామ నవమి సందర్భంగా పది రోజుల పాటు శ్రమించి నేసిన ఓ పట్టు చీర కొంగుపై భద్రాద్రి ఆలయ మూల విరాట్ను నేశారు. శంఖు, చక్ర నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడులను చీర బోర్డర్పై నేశాడు. అలాగే శ్రీరామ రామ రామేతి.. శ్లోకం చీరపై 51 సార్లు కనిపించేలా నేశారు. వన్ గ్రామ్ గోల్డ్ జరీ పట్టుతో రూపొందించిన ఈ ఏడు గజాల చీర బరువు దాదాపు 800 గ్రాములు ఉంటుంది. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను సిద్ధం చేశారు. ప్రతి ఏటా సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు.
సీతారాముల కల్యాణ మహోత్సవం :ఏప్రిల్ 6వ తేదీన సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండుగగా భద్రాచలం మిథులా స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆ రోజు భద్రాద్రి రాముడి సన్నిధిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తోంది.