గోల్డెన్ న్యూస్ / మంచిర్యాల : కాళ్ల పారాణి ఆరక ముందే వరకట్న వేధింపులతో ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గొల్లపల్లి లో చోటు చేసుకుంది. మృతురాలు శృతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… హాజీపూర్ మండలం టీకానపల్లి గ్రామానికి చెందిన కంది శ్రీనివాస్ కవిత దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా చిన్న కూతురు శృతిని పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి మార్చి గత నెల 16వ తేదీన వివాహ సమయంలో 9 తులాల బంగారం ఐదు లక్షల నగదుతో ఘనంగా వివాహం జరిపించారు. అయితే పెళ్లయిన వారం రోజులకే వేధింపులకు గురి చేయడంతో శృతి పుట్టింటికి వెళ్లిపోయింది. పెళ్లి సమయంలో ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని వాటిని నీ పుట్టింటి నుండి తేవాలని అత్త లక్ష్మి మామ శంకరయ్య మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తు తనను ఒత్తిడి పెడుతున్నా డని శృతి కన్నీటి పర్యంతమైంది. కూతురి కాపురం చక్కదిద్దునందుకు అదే రోజు 50 వేల రూపాయలను సాయికి అందజేసి మిగతా సొమ్మును తొందరలోనే ఇస్తామని నచ్చచెప్పి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లవారి ఉదయం 6 గంటలకు అత్తవారింట్లో బాత్రూంలో శృతి చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతురు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారు రోధిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.
