డీలర్లు నిబంధనలు పాటించక పోతే కఠిన చర్యలు

రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే పిడియాక్ట్  నమోదు చేసి జైలుకు పంపిస్తాము..

మంత్రి కొండా సురేఖ

గోల్డెన్ న్యూస్ / దేశాయిపేట : శనివారం దేశాయిపేటలో రేషన్ కార్డు లబ్దిదారు సోల రేణుక ఇంట్లో జిల్లా కలెక్టర్ డా. సత్యశారద, మున్సిపల్ కమిషనర్ డా. అశ్విని తానాజీతో కలిసి మంత్రి కొండా సురేఖ భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..ప్రభుత్వ నిబంధనలు రేషన్ డీలర్లు పాటించాలని లబ్ధిదారులకు సన్నబియ్యం ఇవ్వాలని, రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే  పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపిస్తామని  హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. గత భారాస ప్రభుత్వం పేదలను విస్మరించిందన్నారు. గతంలో మిల్లర్లతో కలిసి దొడ్డు బియ్యాన్ని ప్రాసెస్ చేసి సన్నబియ్యం పేరుతో వసతి గృహాలకు అందించేవారు అన్నారు. రేషన్ డీలర్లు  బియ్యాన్ని కల్తీ చేసి ప్రజలకు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్లు అక్రమాలకు పాల్పడితే లబ్ధిదారులు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ డా. సత్యశారదను మంత్రి ఆదేశించారు. అనంతరం సోల రేణుక కుటుంబ సభ్యులకు మంత్రి, కలెక్టర్ నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు సంధ్యారాణి, సత్యపాల్ రెడ్డి, ఇక్బాల్, కార్పొరేటర్లు కవిత, బస్వరాజు కుమార్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram