జర్నలిస్టులకు ఇండ్లు మంజూరు చేయాలని నిరాహార దీక్ష..
గోల్డెన్ న్యూస్ /వరంగల్ : నగరానికి చెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికి అది కార్యరూపం దాల్చలేదని నిరసిస్తూ స్థానిక జర్నలిస్టులు మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం వారు శాంతియుతంగా దీక్ష చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
నేటి నిరసన కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులు ముందుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎంజిఎం జంక్షన్‌లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సందర్శించి మరో వినతిపత్రాన్ని సమర్పించారు.
తదుపరి జర్నలిస్టులు దేశాయిపేటలోని లక్ష్మీ టౌన్‌షిప్ వద్ద ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల ప్రాజెక్టు ప్రాంగణానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో కూర్చొన్నారు. వారు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, గతంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, ఇళ్ల సమస్యపై స్పష్టత లేకపోవడంతో కుటుంబాలు కష్టాలు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసనకు స్పందన లభించేవరకు దీక్షను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.









