వీధుల్లో గుంపులుగా కుక్కలు సంచారం
పాలచారులు వాహనదారుల పై దాడి
భయాందోళనలో జనం
ఆహారం, నీరు దొరక్కపోవడమేదాడికి కారణమా?
మణుగూరులో రోజురోజుకూ కుక్కకాటు ఘటనలు
గోల్డెన్ న్యూస్ /మణుగూరు : మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్క డో ఒక చోట మనుషులపై దాడి చేసి గాయపరుస్తూ నే ఉన్నాయి. వీధులు, రోడ్లపై గుంపులు గుంపులు గా తిరుగుతూ పాదచారులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి. అంతేకాకుండా ఇళ్లలోకి దూరి దాడి చేస్తున్నాయి. కుక్క కాటుకు గురైన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇటీవలి కాలంలో వీటి ఉన్మాదానికి చిన్నపిల్లలు, వృద్ధులు బలైపోతున్న ఘటనలు పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా కాంగ్రెస్ మైనార్టీ విభాగానికి చెందిన నాయకుడు రహీమ్ పాషా వీధి కుక్కల దాడికి గురయ్యారు. శేషగిరి నగర్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.
ఇదే ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం ఓ చిన్నారి కూడా కుక్కల దాడికి గురై గాయపడ్డాడు. ఆ ఘటన మరవకముందే ఇప్పుడు రహీమ్ పాషా ఘటన జరగడం పట్ల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ముఖ్యంగా ఉదయం వాకింగ్‌కి వెళ్లేవారు, పిల్లలు స్కూళ్లకు వెళ్ళే సమయంలో తల్లిదండ్రులు వారిని సురక్షితంగా పంపించాలంటే భయపడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో మున్సిపాలిటీ అధికారులు తక్షణమే కుక్కల నియంత్రణపై గట్టిగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి చోట రోజూ కనీసం మూడు నాలుగు కుక్కలు కనిపిస్తున్నాయి. ఇవి సమూహంగా తిరుగుతూ ఎవరి పైన పడితే వారి మీద దాడి చేస్తున్నాయి. ఇది ఎవరూ ఊహించని ప్రమాదాలకు దారి చేస్తుంది అంటూ స్థానికులు రాబోతున్నారు. ఒకప్పుడు వీధి కుక్కలు మనుషులపై దాడి చేసేవి కావు. గ్రామాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినా, వాటికి హాని చేసే జంతువులు, ఇతర ప్రాణులు ఏవైనా కనిపిస్తే దాడి చేయడం చూశాం. కానీ ఇప్పుడు మనుషులపై దాడి చేయడం ఎక్కువైంది. ఏ కుక్క మంచిదో ఏది పిచ్చిదో తెలియని పరిస్థితి నెలకొంది. శునకాల దాడికి ప్రధాన కారణం ఆకలి అని పలువురు అంటున్నారు. గ్రామాల్లో, మున్సిపలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మెరుగుపడింది. దీంతో వాటికి ఆహారం దొరకడం లేదు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ ప్రారంభమయ్యాక రోడ్డు పక్క అన్నం, ఇతర ఆహార పదార్థాలు పడేయడం తగ్గింది. దీంతో వాటికి ఆహారం దొరకడం కష్టంగా మారింది. పైగా కుక్కలు తరుచూ దాడి చేస్తుండడంతో వాటిని ఎవరూ చేరదీసి ఆహారం పెట్టడం లేదు. దీంతో అవి ఆకలికి అలమటిస్తున్నాయి. కనీసం దాహం తీర్చుకునేందుకు వీధి నల్లాల వద్ద నీరు కూడా దొరడం లేదు. దీంతో అవి ఆకలి, దూప కారణంగా మనుషులపై దాడికి పాల్పడుతున్నాయనే ప్రచారం ఉంది.
ప్రజల జీవన భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మణుగూరు మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.