గోల్డెన్ న్యూస్ / పెద్దపల్లి: పెద్దపల్లి సమీపంలో గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, లారీని ఢీకొన్న ఘటనలో 29 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రహదారిపై మరమ్మతు పనులు జరుగుతుండటంతో ఇరువైపులా వాహనాలను ఒకే మార్గంలో నడిపిస్తుండగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాలు ప్రకారం పెద్దపల్లి నుంచి గోదావరిఖనికి వెళ్తున్న గోదావరిఖని డిపో ఆర్టీసీ బస్సు పెద్దపల్లి మండలం అందుగుపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 29 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో పెద్దపతి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రి క్యాజువాలిటీ వార్డు సరిపోకపోవడంతో పలువురు క్షతగాత్రులకు వరండాలో చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ నాగేందర్ , లారీ డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారు. బస్సు కండక్టర్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ పరామర్శించారు. ఘటనా స్థలంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వేరే వైపుకు వాహనాలను మళ్లించారు.
