సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు

గోల్డెన్ న్యూస్/ నిజామాబాద్ :  ప్రస్తుత వేసవిలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తినా, ధాన్యం అమ్మకాలలో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు నెలకొని ఉంటే, వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 

కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 425 6644 కు ఫోన్‌ చేసి సమస్యలు తెలుపవచ్చని అన్నారు. కంట్రోల్‌ రూమ్‌ కార్యాలయాల పని దినాలలో ప్రతి రోజు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, నిర్ణీత వేళల్లో టోల్‌ ఫ్రీ నెంబర్‌ కు ఫోన్‌ చేసి ధాన్యం అమ్మకాలు, తాగునీటి సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలుగా కంట్రోల్‌ రూమ్‌ లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని అన్నారు.

 

అదేవిధంగా, తాగునీటి సమస్య ఉన్నట్లయితే సెల్‌ నెంబర్‌ : 7382844951 కు, ధాన్యం అమ్మకాలలో ఇబ్బందులు ఉంటే సెల్‌ నెంబర్‌ : 7382844769 కు వాట్సాప్‌ ద్వారా సమాచారం అందించవచ్చని కలెక్టర్‌ సూచించారు. జిల్లా ప్రజలు, రైతుల సౌకర్యార్థం నెలకొల్పిన కంట్రోల్‌ రూమ్‌ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram