ఏజెన్సీ ఎస్సీల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి దామోదర్

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్‌ : ఏజెన్సీ ప్రాంతానికి చెందిన షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగ హక్కులు మరియు హక్కుల ఆధారిత వనరులు కట్టుబాటు కావడంతో తలెత్తిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారు.

 

షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్, గురువారం మంత్రి నివాసంలో భేటీ కావడంతో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఎస్సీ కులాలకు స్థానిక రాజకీయ రిజర్వేషన్లు, సాగుభూముల హక్కుపత్రాలు, స్థానిక ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు లభించకపోవడం అన్యాయంగా జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

అదే సమయంలో, అభివృద్ధికి దూరంగా ఉన్న స్థానిక ఎస్సీ నిరుపేదులను (నాన్ ట్రైబ్స్) అభివృద్ధి చెందిన ఇతర కులాలతో సమానంగా చూసి ప్రయోజనాలు కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు.

 

ఈ అంశంపై స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, “ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా వివరించి, రిజర్వేషన్లతో పాటు ఇతర హక్కుల పరిరక్షణకు కృషి చేస్తాను. పరిష్కారం వచ్చే వరకు వదిలిపెట్టను,” అని హామీ ఇచ్చారు.

 

ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ గౌరవ సలహాదారులు హైకోర్టు న్యాయవాది మల్లన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు బలవంతపు సంపత్ కుమార్, రజిని అంబేద్కర్, రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram