రోమన్ కాథలిక్ చర్చీ పరమగురువు పోప్ ఫ్రాన్సిస్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్రపంచ క్రైస్తవులకు మార్గదర్శిగా, రోమన్ కాథలిక్ చర్చీ పరమగురువుగా సేవలందించిన పోప్ ఫ్రాన్సిస్ గారి మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో క్రైస్తవ సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోప్ గారి అనుయాయులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

పోప్ ఫ్రాన్సిస్ ప్రేమ, కరుణ, సామరస్యం మార్గాల్లో సమాజాన్ని నడిపించే విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి అన్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు, పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యలు, ప్రపంచ శాంతి స్థాపన కోసం చేసిన కృషి అన్ని ప్రత్యేకమైనవని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.

 

అర్జెంటీనాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించి, ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని నడిపించే మహోన్నత స్థాయికి ఎదిగిన పోప్ ఫ్రాన్సిస్ గారు తన నిరాడంబర జీవనశైలితో ప్రజల మనసులు గెలుచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన వల్ల వాటికన్ సిటీ సామాన్యులకు చేరువైంది. అణగారిన వర్గాల గొంతుకగా ఆయన నిలిచారని, ఆయన బోధనలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో క్రైస్తవ సమాజానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన భక్తులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram