పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు.. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన హార్స్ రైడర్..

జమ్మూకశ్మీర్ ప్రాంతం పహల్గాంలోని సుందరమైన బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై మంగళవారం ఉగ్రవాదులు దాడికి తెబడిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 28మంది పర్యాటకులు మరణించారు. పర్యాటకులపై కాల్పులు జరిపేందుకు సిద్ధమైన ఉగ్రవాదులను అడ్డుకునేందుకు ఓ హార్స్ రైడర్ ప్రయత్నించాడు.

వారితో కొద్దిసేపు వీరోచితంగా పోరాడాడు.. ఈ క్రమంలో వాళ్ల చేతుల్లో ఏకే47 రైఫిళ్లను లాక్కొనేందుకు ప్రయత్నించగా.. ఉగ్రవాదులు అతనిపై తూటాలు పేల్చడంతో చనిపోయాడు.

ఉగ్రవాదులు పర్యటకులపై దాడికి దిగగా సయ్యద్ హుస్సేన్ షా అనే వ్యక్తి వీరోచిత పోరాటం చేశాడు. వారి నుంచి తుపాకీ లాక్కొనేందుకు ప్రయత్నించాడు. అయితే, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. సయ్యద్ హుస్సేన్ షా జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాకు చెందిన యువకుడు. కారు పార్కింగ్ ప్రాంతం నుంచి గుర్రంపై బైసరన్ సుందరమైన ప్రాంతానికి పర్యాటకులను తీసుకెళ్తూ ఉపాధి పొందుతున్నాడు. అలా వచ్చిన సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం హుస్సేన్ మృతితో అతడి కుటుంబం రోడ్డున పడింది. అతడి మీద ఆధారపడి తల్లిదండ్రులు, భార్యా పిల్లలు ఉన్నారు.

గుర్రం  తోలుతూ ఇంటిని పోషించే నా కొడుకును ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ హుస్సేన్ తల్లి రోదిస్తుంది. హుస్సేన్ తండ్రి సయ్యద్ హైదర్ షా మాట్లాడుతూ.. పని నిమిత్తం నా కుమారుడు పహల్గాం వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఈ ఉగ్రవాదుల దాడి గురించి మాకు తెలిసింది. వెంటనే నా కుమారుడికి ఫోన్ చేశా.. కానీ స్విచ్ఛాఫ్ వచ్చింది. సాయంత్రం 4.40గంటల సమయంలో ఫోన్ రింగ్ అయింది. కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. భయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. ఆ దాడిలో నా కుమారుడు గాయపడినట్లు మాకు తెలిసింది. కొద్దిసేపటి తరువాత ఉగ్రవాదుల తూటాలకు నా కుమారుడు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.’’ అంటూ సయ్యద్ హైదర్ షా కన్నీటి పర్యాంతమయ్యాడు.

Facebook
WhatsApp
Twitter
Telegram