ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

గోల్డెన్ న్యూస్ /షాద్‌నగర్ : తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో, ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ పరిధిలో వెలుగుచూసింది. ఆపై భర్త కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేసి పోలీసులకే మాయ జాల వేయడం కలకలం రేపింది. షాద్‌నగర్ ఏసీపీ ఎన్‌సిహెచ్ రంగస్వామి మీడియాకు వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

 

కేసు  ఇలా…

ఫరూక్‌నగర్ మండలం చిన్న చిల్కమర్రి గ్రామానికి చెందిన ముద్దునోళ్ల ఎరుకలి మౌనిక తన భర్త ఎరుకలి యాదయ్య (32) ఫిబ్రవరి 19న కనిపించకుండా పోయాడని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 205/2025 కింద కేసు నమోదు చేసి పట్టణ సీఐ విజయ్ కుమార్, ఎస్సై సుశీలల నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభమైంది.

 

అక్రమ సంబంధం హత్యకు దారి తీసింది

విచారణలో మౌనికకు ఫరూక్‌నగర్ మండలంలోని కందివనం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎరుకలి అశోక్‌తో గత కొంత కాలంగా అక్రమ సంబంధం నడుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మౌనిక భర్త యాదయ్యతో కుటుంబ కలహాలు జరుగుతుండగా, అదే సమయంలో రాఘవేంద్ర పత్తి కంపెనీలో పనికి వెళ్లే సమయంలో అశోక్‌తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారి తీసింది.

 

ఫిబ్రవరి 18వ తేదీన అశోక్, మౌనికలతో కలిసి ప్లాన్ ప్రకారం యాదయ్యను విందుకు తీసుకెళ్తున్నాను అని చెప్పి రాత్రి 11 గంటల సమయంలో గూడూరు గ్రామ శివారులో నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగించిన అనంతరం వేట కొడవలితో గొంతు కోసి హత్య చేసి, శవంపై పెట్రోల్ పోసి దహనం చేశాడు. అనంతరం ఇద్దరూ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో అద్దె ఇంట్లో కలిసి సహజీవనం చేస్తున్నారు.

 

పోలీసుల విచారణలో అంగీకరించిన నిందితులు

ఈ అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసి, ఏప్రిల్ 23న మౌనిక, అశోక్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాళ్లు తడబడుతూ చివరకు నేరాన్ని అంగీకరించారు. నిందితుల చూపించిన ప్రదేశంలో మిగిలిన ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. హత్యలో ఉపయోగించిన ఆటో, వేట కొడవలిని సీజ్ చేశారు.

 

నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, ఈ కేసును చేధించడంలో కీలక పాత్ర పోషించిన సీఐ విజయ్ కుమార్, ఎస్సై సుశీల, హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్, సిబ్బంది సువర్ణ, నరేందర్, రాజేష్, కరుణాకర్‌లకు రివార్డుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు ఏసీపీ రంగస్వామి తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram