ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్

గోల్డెన్ న్యూస్/ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 77.18 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం అర్హులను ఎంపిక చేయడానికి పలు మార్గదర్శకాలను  విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రకారం మొత్తం దరఖాస్తుల్లో 36.03 లక్షలు అంటే 46.7 శాతం మంది మాత్రమే అర్హులని తేలింది.

 ఇందిరమ్మ ఇళ్లకు  వీరు అనర్హులు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం యాప్ ద్వారా సర్వే నిర్వహించింది. ఇందులో అనర్హులను గుర్తించింది. కారు, ట్రాక్టర్ లాంటి నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారు ఇందిరమ్మ ఇల్లు పొందడానికి అనర్హులు. అలాగే ఇప్పటికే ఇళ్లు ఉన్నవారికి మంజూరు చేయరు. గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు పొందిన వారిని కూడా లిస్ట్ నుంచి తీసేశారు.

 

అలాగే కొత్తగా ఇంటి నిర్మాణం ప్రారంభించిన వారికి సైతం అవకాశం లేదు. పథకంలో పేరు వచ్చాకే ఇంటి నిర్మాణం ప్రారంభించాలి. ముందే ప్రారంభించిన వారికి జాబితాలో అవకాశం ఇవ్వలేదు. 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటేనే ప్రభుత్వ సాయం అందనుంది. లేదంటే వారిని జాబితా నుంచి తొలగిస్తారు.

 

  వీరికే ప్రాధాన్యత

మొదటి విడతలో అత్యంత పేదలకే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒంటరి మహిళలు, వితంతు మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అనంతరం గుడిసె ఉన్నవారిని, తర్వాత పెంకుటిళ్లు ఉన్న వారిని ఈ పథకం కోసం ఎంపిక చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram