గోల్డెన్ న్యూస్ /మణుగూరు : ఈనెల 20 న దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం మణుగూరు ఎస్ఓ టు జీఎంకు సమ్మె నోటీసు అందజేశారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆర్. మధుసూదన్ రెడ్డి, జి. శ్రీనివాస్, మాట్లాడుతూ ఈనెల 20న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో జాతీయ కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర కార్మిక సంఘాలు కూడా పాల్గొంటున్నాయని, ఈ సమ్మె పది డిమాండ్లతో జరుగుతుందని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని ఇంకా తదితర డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతుందని అన్నారు. సింగరేణిలో కూడా కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచక 8 సంవత్సరాల అయిందని, మేడే సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తారని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎంతో ఆశతో ఎదురు చూశారని, కానీ రేవంత్ రెడ్డి గారి మే డే ప్రసంగంలో వేతనాల పెంపు ప్రకటన లేకపోవడంతో నిరాశ చెందారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సింగరేణి కాంటాక్ట్ కార్మికుల వేతనాలు పెంచకపోవడంతో ఆగ్రహం చెందిన కార్మిక వర్గం కాంగ్రెస్ ఇచ్చిన హామీతో సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాంటాక్ట్ కార్మిక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వి. జానయ్య, ఎస్. సాంబశివరావు, ఎన్. నాగేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.