గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: గిరిజన గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. శనివారం తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రహదారి సదుపాయం లేకపోతే తమ ప్రాంతాలు ఎలా అభివృద్ధి సాధిస్తాయని అధికారులను మంత్రి సీతక్క ప్రశ్నించారు. మా ప్రాంతం అభివృద్ధి కావద్దా అని నిలదీశారు. హైదరాబాద్ వంటి నగరాల్లో స్కై వేలు, హైవేలు, ఆరు వరుసల రోడ్లు వస్తున్నాయని తెలిపారు. అటవీ అభయారణ్య చట్టాల కారణంగా ములుగు వంటి ప్రాంతాల్లో సింగల్ రోడ్లు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి సీతక్క.
సరైన రహదారులు సదుపాయాలు రాక తాము చీకట్లోనే మగ్గిపోవాలా అని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. అడవి ప్రాంతాలు, ఆదివాసి ప్రాంతాల్లో అభివృద్ధి జరగనీయకపోతే అంతరాలు పెరుగుతాయని అన్నారు. ఆదివాసీలు ఆదిమానవులలాగానే మిగిలిపోతారని చెప్పుకొచ్చారు. ఆదివాసి ప్రజల కోసం ఏజెన్సీలో బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. వర్షాకాలంలో రోడ్డు లేకపోవడంతో బురదలో కూరుకు పోతున్నాయని వాపోయారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అటవీశాఖ సహకరించాలని మంత్రి సీతక్క కోరారు.
అటవి చట్టాలను ఉల్లంగించాలని తాము చెప్పడం లేదని మంత్రి సీతక్క అన్నారు. వన్యప్రాణులకు ప్రమాదమని రహదారులు వేయనీయకపోతే ఎలా అని ప్రశ్నించారు. వన్యప్రాణులకు ప్రత్యేక బ్రిడ్జిలు వేయడం ద్వారా వాటిని కాపాడవచ్చని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఇక్కడ కూడా అవే నిబంధనలను అమలు చేయాలని కోరారు. ప్రజల సౌకర్యార్థం అటవీ అభయారణ్య చట్టాల్లో కొన్ని సడలింపులు ఉన్నాయని.. వాటిని వర్తింపజేసి ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి తదితర ప్రాంతాల్లో రోడ్ల సదుపాయం కల్పించాలని సూచించారు. మేడారం జాతర కోసం ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని మంత్రి సీతక్క కోరారు..