గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ఎస్టీ గురుకులంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్త సమ్మేళనంలో రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గిరిజన అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఇందిరాగాంధీ హయాంలో సుమారు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను గిరిజనులకు పంపిణీ చేశారని, ఆ భూములను గత బారాస ప్రభుత్వంలో నాయకులు పక్కదోవ పట్టించారని అన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నూతన విధానాలతో స్కీం లను ప్రవేశపెడుతుందని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు విలువైన భూములను కాపాడేందుకు ప్రజా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులు అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమానికి ముందు కిన్నెరసాని వద్దగల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి శ్రమదానం చేశారు. ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తను ఎత్తివేసి శుభ్రం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంగణంలో మొక్క నాటారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిమాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. ప్రజలు చైతన్యవంతులని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
