గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ : సరదాగా స్నేహితులతో కలిసి ఆ రాత్రి ఊరి శివారులో మద్యం తాగాడు. అక్కడ ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియదు.. తెల్లారేసరికి ఒళ్ళు కాలిపోయి కూర్చున్న చోటులోనే కూర్చున్నట్టు మృత్యువాత పడ్డాడు. కూర్చున్న స్థితిలో ఒళ్ళు గగుర్పొడిచేలా ఒళ్ళంతా కాలిపోయి ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే .. ఒంగోలు సమీపంలోని ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన 29 ఏళ్ళ బొడ్డపాటి ద్రోణాచలం అలియాస్ రాజా గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. బెంగుళూరులో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ద్రోణాచలం నాలుగు రోజుల క్రితం భార్యాపిల్లలను చూసుకునేందుకు స్వగ్రామం వచ్చాడు. భార్య పుట్టిల్లు సత్తెనపల్లికి వెళ్ళి భార్య, ఏడునెలల కొడుకును చూసుకుని తిరిగి ముక్తి నూతలపాడు వచ్చాడు. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు.
మద్యం తాగే అలవాటు ఉన్న ద్రోణాచలం ఎప్పటిలాగే స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓ రియల్ వెంచర్‌లో సిట్టింగ్ వేశారు. రాత్రి 10 గంటలైంది. ద్రోణాచలం ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు ఫోన్ చేశారు. స్విచ్చాఫ్ వచ్చింది. తిరిగి సత్తెనపల్లిలో ఉన్న భార్య దగ్గరకు వెళ్ళి ఉంటాడన్న అనుమానంతో అక్కడికి కూడా ఫోన్ చేశారు. సత్తెనపల్లికి కూడా రాలేదని భార్య చెప్పడంతో ఇక రాత్రంతా ద్రోణాచలం ఆచూకీ కోసం కుటుంబసభ్యులు అతనికి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తోంది.
మురుసటి రోజు ఉదయం బంధువులతో కలిసి ద్రోణాచలం కోసం తల్లిదండ్రులు గాలించారు. సాయంత్రానికి గ్రామస్థులు ఫోన్ చేసి ద్రోణాచలం మృతదేహం గ్రామ శివారులో లభ్యమైందని చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా వినిపించారు. తమ బిడ్డకు గ్రామంలో ఎవరితో విభేదాలు లేవని, అప్పడప్పుడు మద్యం తాగుతాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. భార్య, చంటిబడ్డలు అనాథలయ్యారంటూ భోరున విలపిస్తున్నారు.
అసలేం జరిగింది.. కలిసి మద్యం తాగిన స్నేహితులు ఎవరు.?
ముక్తినూతలపాడు శివారులో కాలిపోయిన స్థితిలో మృతదేహం పడి ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు కూర్చున్న చోటే కూర్చుని ఉండగానే చనిపోయిన స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. మృతదేహం ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన కారు డ్రైవర్ బోడపాటి డ్రోణాచలం అలియాస్ రాజాదిగా గుర్తించారు. మృతుని ఒంటి నిండా కాలిన గాయాలు ఉన్నాయి. ఘటనా స్థలంలో పాక్షికంగా కాలిన సెల్‌ఫోన్, ఆ పక్కన మందు బాటిళ్ళు కనిపించాయి. అంతే కాకుండా మృతుడి చేతి వేళ్ళు తెగిపడి కొద్దదూరంలో కనిపించాయి. ఒంటిపై ఉన్న దుస్తులు కూడా కాలిపోయాయి. కాళ్ళకు ఉన్న బూట్లు మాత్రం అలాగే ఉన్నాయి.