బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత

 ⇒ సీతారామ ప్రాజెక్టు సాగునీటిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రైతాంగానికి తక్షణమే అందించాలి

⇒ ఆరు గ్యారెంటీలలోని 13 అంశాలను తక్షణమే అమలు చేయాలి

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య గారి ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్టు సాగు నీటిని భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రైతాంగానికి తక్షణమే అందించాలని, ఆరు గ్యారెంటీలలోని 13 అంశాలను తక్షణమే అమలు చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య గారి ఆధ్వర్యంలో మండల కమిటీ తాహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ధరణి ఆపరేటర్ చందా కౌసల్య గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర కాలం నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా సాగునీటి ప్రాజెక్టులు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని అశ్వాపురం మండలం అమ్మగారి పల్లి వద్ద సీతారామ ప్రాజెక్టు సీతమ్మ సాగర్ ఎత్తిపోత పథకాలను నెలకొల్పినారు.దాదాపు 90 శాతం పనులను కూడా పూర్తి చేసినారు. అమలు గాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత సంవత్సరం హంగు ఆర్భాటాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించారు.ప్రాజెక్టును నెలకొల్పినదేమో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు మాత్రం ముందుగా ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఖమ్మం జిల్లాకు తరలించుకుని పోవుచున్నారు. ఖమ్మం జిల్లాకు సాగునీరు ఇవ్వడం సమంజసమే కానీ భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రైతాంగానికి సాగునీరు ఇవ్వకపోవడం మాత్రం దుర్మార్గం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని భద్రాద్రి జిల్లాకు సాగునీరు అందించవలసిందిగా రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినది.అధికారంలోకి వచ్చిన 100 రోజులలో ఆరు గ్యారెంటీలలోని 13 అంశాలను అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డుల పేరుతో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు కాకపోగా సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్నది.ఇకనైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఆరు గ్యారెంటీలలోని 13 అంశాలను తక్షణమే అమలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నామని,ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు జిల్లాలో మంత్రులు పర్యటనలను అడ్డుకుంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ బిఆర్ఎస్ పార్టీ సామాన్య ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram