జ్వర పీడితులను పరామర్శించిన వైద్యాధికారి డాక్టర్. రవితేజ.
గోల్డెన్ న్యూస్ : కరకగూడెం : మండలం అనంతారం గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఇటీవల జ్వరాలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్. రవితేజ సోమవారం కాలనీలోని జ్వర బాధితులను పరామర్శించి వారికి వైద్య సేవలు అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవితేజ మాట్లాడుతూ, కాలనీలో ఎక్కువగా జ్వరాలు రావడం ఆందోళన కలిగించే అంశమని, ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకుండ చూసుకోవాలని, కలుషిత నీరు తాగకుండా జాగ్రత్తలు పాటించాలని, పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని తెలిపారు. చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం, దోమతెరల వినియోగం వంటి జాగ్రత్తల ద్వారా అనారోగ్యాలను నివారించవచ్చని పేర్కొన్నారు.
జ్వర లక్షణాలు కనిపించగానే వెంటనే రక్తపరీక్షలు చేయించుకోవాలన్నారు. వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. పండ్లు, ధ్రవ పదార్థాల వినియోగం పెంచుతూ డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడితే త్వరగా కోలుకునే అవకాశముందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ పోలిపోయిన కృష్ణ, ఎం.పి.హెచ్.ఎ లు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.