ప్రేమ వ్యవహారంలో అడ్డొస్తున్నాడని తండ్రినే కడతేర్చిన కూతుళ్లు

సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్ : మరిపెడ మండలంలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురు ప్రేమ వ్యవహారానికి అడ్డుచెప్పాడన్న కోపంతో సొంత కుటుంబ సభ్యులే కిషన్ అనే వ్యక్తిని మంగళవారం దారుణంగా కొట్టారు. మరిపెడ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం డీఎస్ఆర్ జెండాల్ తండాకు చెందిన ధారావత్ కిషన్ (40)కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కిషన్ చిన్న కుమార్తె పల్లవి అదే తండాకు చెందిన భూక్య సురేశ్‌ అనే యువకుడితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. ఈ విషయంపై కుమార్తెను కిషన్ మందలించాడు. దాంతో తన ప్రేమను తండ్రి అంగీకరించడం లేదని పల్లవి తీవ్ర ఆగ్రహానికి గురైంది.ఈ క్రమంలోనే కిషన్ భార్య కావ్య, ఇద్దరు కుమార్తెలు రమ్య, పల్లవి, ఆమె ప్రియుడు భూక్య సురేశ్‌, మరో ఇద్దరు యువకులు బోడ చందు, దేవేందర్‌ కలిసి కిషన్‌పై దాడికి పాల్పడ్డారు. అందరూ కలిసి కిషన్‌ను తీవ్రంగా కొట్టడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలపాలైన కిషన్‌ను అతని తల్లి సాంకి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కిషన్ ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటనపై మృతుడు కిషన్ తల్లి సాంకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిషన్ భార్య కావ్య, కుమార్తెలు రమ్య, పల్లవి, పల్లవి ప్రియుడు భూక్య సురేశ్‌తో పాటు దాడిలో పాల్గొన్న బోడ చందు, దేవేందర్‌లపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కుటుంబ కలహాలు, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఇంతటి దారుణానికి దారితీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram