తీరని డోలీ కష్టాలు.. మహిళను 6 కి.మీ. మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు

దశాబ్దాలు గడుస్తున్నా ఆదివాసీలు, గిరిజనుల అవస్థలు తీరడం లేదు.ప్రాణం నిలబెట్టేందుకు డోలిపై ఆరు కిలోమీటర్లు మోసుకుంటూ ఆంబులెన్స్ ఎక్కించి  ఆస్పత్రికి తరలింపు..

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : దశాబ్దాలు గడుస్తున్నా ఆదివాసీలు, గిరిజనుల అవస్థలు తీరడం లేదు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం  అతి మారుమూల గ్రామమైన నీలాద్రి పేటలో ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఆ గ్రామస్థులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసం చేశారు. సుమారు ఆరు కిలోమీటర్లు కాలినడకన, కొండకోనలు, వాగులు, వంకలు దాటుతూ బాధిత మహిళను జెడ్డి సహాయంతో భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళితే..

మండలంలోని మారుమూల పద్మాపురం పంచాయతీ నీలాద్రి పేట గండి గ్రామానికి చెందిన మాడవి ఉంగమ్మ(36)  జ్వరం విరోచనాలతో బాధపడుతూ బుధవారం ఆమె పరిస్థితి విషమంగా మారింది. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ గ్రామానికి కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ ఆమె భర్త జోగయ్య, గ్రామస్థులు సహకారంతో జెడ్డి పై నీలాద్రిపేట గ్రామం నుంచి ఆరు కిలోమీటర్లు కాలినడకన రోడ్డు మార్గానికి చేరుకున్నారు. అక్కడ నుంచి 108 అంబులెన్స్‌లో మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళకు వైద్య సేవలను అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచార. తమ గ్రామానికి పక్కా రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram