గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గురువారం మనీశా అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో అవినీతి జరుగుతోందని, వివిధ పనులు నిమిత్తం కార్యాలయానికి వెళ్లిన వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పెద్దఎత్తున ఏసీబీ టోల్ నంబరుకి ఫిర్యాదులు అందడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ నేతృత్వంలో ఏసీబీ సిబ్బంది గురువారం మధ్యాహ్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయం నుంచి ఎవరిని బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. కార్యాలయం వచ్చిన సభ్యులను అవినీతిపై ఆరా తీశారు. ప్రశ్నించి దళారులుగా నిర్ధారించుకున్నారు. వారు ఏ లావాదేవీల నిమిత్తం వచ్చారో తెలుసుకుని ఆ రిజిస్ట్రేషన్లను, లావాదేవీలను పరిశీలించారు. అలాగే గురువారం జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్ ఎన్ని, వాటికిగాను ఎంత మేరకు నగదు లావాదేవీలు జరిగాయో పరిశీలించారు. అకౌంట్స్ సెక్షన్లో అకౌంట్లను, నగదును పరిశీలించారు. పలు రికార్డులతో పాటు ఆన్లైన్ లావాదేవీలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలించారు. అనుమానం వచ్చిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దస్త్రాల గురించి సబ్జిస్ట్రార్ కార్యాలయ అధికారులను అడిగినప్పటికీ వారి వద్ద నుండి సరియైన సమాధానం రాలేదు.
