రేషన్‌ బియ్యానికి మరో రెండు రోజులే గడువు.

కొత్త రేషన్‌కార్డుదారులకు నిరాశేనా ?

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల రేషన్‌ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 92.18 శాతం మందికి రేషన్‌ సరఫరా పూర్తయింది. 5.27 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది.

 

సాధారణంగా ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్‌దారులకు డీలర్లు బియ్యం ఇస్తారు. వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు జూన్‌తో పాటు జులై, ఆగస్టు రేషన్‌ను కూడా ఈ నెలలోనే ఇస్తున్నారు. 3 నెలల రేషన్‌ పంపిణీ గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు తీసుకోని వారు ఉంటే ఎల్లుండి వరకు రేషన్‌ షాపులకు వెళ్లి తీసుకోవచ్చు.

 

30వ తేదీ వరకు రేషన్‌ షాపులు తెరిచి ఉంచాలని పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. అటు విడతల వారీగా కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పాత కార్డుల్లోనూ కుటుంబ సభ్యుల పేర్లను చేరుస్తోంది. ఈ క్రమంలోనే జూన్‌లో కొత్తగా రేషన్‌ కార్డులు మంజూరైన వారు.. రేషన్‌షాపులకు వెళ్లగా అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది. కొత్తగా కార్డులు మంజూరైన వారికి సెప్టెంబర్‌ నెలలోనే బియ్యం వస్తాయని రేషన్‌ డీలర్లు చెబుతుండటంతో వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram