⇒ అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయొద్దు.
⇒పోలీసు అధికారులు అందుబాటులో ఉండాలి
⇒డయల్ 100 ద్వారా సహాయం పొందండి.
⇒ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చెయ్యొద్దని ప్రజలకు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్ర వాహం గురించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని ప్ర త్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లే ప్రమాదం ఉండడంతో, రహదారులపైకి నీరు వచ్చి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రదేశాలకు వెళ్లడం వల్ల ప్రమాదాలు సంభవించవచ్చునని పేర్కొన్నారు. అలాంటి ప్రదేశాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు.
ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం, వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయ చర్యల కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ (DDRF) బృందాలను 24×7 అందుబాటులో ఉంచారు. జిల్లా పోలీసు శాఖ ఇతర శాఖలతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తూ, ప్రమాదకరమైన ప్రదేశాల్లో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది.
ప్రజలు ఏవైనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు శాఖ సేవలు పొందాలని ఎస్పీ సూచించారు. ప్రజల సహకారం అత్యంత అవసరం అని, పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.