అంగన్వాడి హెల్పర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : అంగన్‌వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు అంగన్‌వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు గరిష్ఠ వయోపరిమితిని 45ఏళ్ల నుంచి 50ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆ శాఖ మంత్రి సీతక్క సంబంధిత ఫైలుపై గురువారం సంతకం చేశారు. ఇటీవలే అంగన్‌వాడీ టీచర్ల రిటైర్‌మెంట్‌ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచారు. ఈ నేపథ్యంలో 50 ఏళ్ల వయసులో టీచర్‌గా పదోన్నతి పొందే హెల్పర్లు 15 ఏళ్లు విధులు నిర్వర్తించే అవకాశం ఉండనుంది. ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.సర్కారు తాజా నిర్ణయంతో 45 ఏళ్లు దాటిన 4,322 మంది అంగన్‌వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి దక్కనుంది. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, ఆ శాఖ డైరెక్టర్‌ సృజన, సెర్ప్‌ సీఈవో దివ్యా దేవరాజన్‌, తెలంగాణ ఫుడ్స్‌ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్‌వాడీల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. చిన్నారుల్లో పోషకాహార మెరుగుదల పరిశీలనకు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. వారికి అందించే ఆహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా వంద రోజులపాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

 

ఎస్‌హెచ్‌జీలకు ఆర్డీసీ ద్వారా రూ.కోటి చెల్లింపు

 

ఆర్టీసీకి అప్పగించిన అద్దె బస్సుల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) రూ.కోటి ఆర్జించాయని మంత్రి సీతక్క తెలిపారు. అద్దె ప్రాతిపదికన ఎస్‌హెచ్‌జీలు 150 బస్సులను ఆర్టీసీకి అప్పగించాయని, ఒక్కో బస్సుకు ఆర్టీసీ ప్రతి నెలా రూ.70 వేలు చెల్లిస్తోందన్నారు. మొదటి నెల అద్దెకు సంబంధించిన రూ.కోటి 5 లక్షల చెక్కును ఆర్టీసీ యాజమాన్యం సెర్ప్‌ సీఈవోకు అందజేసిందని తెలిపారు. ఎస్‌హెచ్‌జీలకు ఈ నెల 5న ప్రజాభవన్‌లో చెక్కులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram