ఫాస్ట్‌ట్యాగ్‌ సరిగా అతికించారా లేదా ?

ఇలా చేయకుంటే మీరే నష్టపోతారు

 

దేశవ్యాప్తంగా టోల్ సేకరణ వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు భారత జాతీయ రహదారుల సంస్థ కీలక చర్యలు తీసుకుంది. ఇటీవల, ఫాస్ట్‌ట్యాగ్‌లను వాహనాల విండ్‌స్క్రీన్‌పై సరిగ్గా అతికించకుండా లూజ్ ఫాస్ట్‌ట్యాగ్‌లు, ట్యాగ్ సరిగా కనిపించకుండా ఉంచే వాటిని నియంత్రించేందుకు కొత్త విధానం (ఫాస్టాగ్ అలెర్ట్) ప్రకటించింది.

 

ఈ నిర్ణయం ద్వారా టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించనున్నారు.

 

♦ఈ ఫాస్ట్‌ట్యాగ్‌ల సమస్య ఏంటి?

 

పలువురు వాహన యజమానులు ఫాస్టాగ్‎లను విండ్‌స్క్రీన్‌పై అతికించకుండా లూజ్ మోడ్‎లో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులు చేసేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో రద్దీ పెరగడంతోపాటు క్లోజ్డ్-లూప్ టోలింగ్ సిస్టమ్‌లో దుర్వినియోగం జరుగుతుంది. దీనివల్ల ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వాటి కారణంగా ఇతర వినియోగదారులకు ఆలస్యం, అసౌకర్యం జరుగుతుందని వెల్లడించారు

ఇప్పటికే ఆదేశాలు..

 

ఈ సమస్యను నివారించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ.. టోల్ సేకరణ సంస్థలు, కాంట్రాక్టర్లకు ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేసింది. విండ్‌స్క్రీన్‌పై సరిగ్గా అతికించని ఫాస్టాగ్‎ల గురించి తెలుపాలని వెల్లడించింది. ఆ రిపోర్టుల ఆధారంగా సంబంధిత ఫాస్టాగ్‎లను బ్లాక్‌లిస్ట్ చేయడానికి ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు తీసుకుంటోంది. లూజ్ ఫాస్టాగ్‎లను రిపోర్ట్ చేయడానికి ఎన్‌హెచ్‌ఏఐ ఒక ప్రత్యేక ఇమెయిల్ ఐడీని అందుబాటులో ఉంచింది. టోల్ సేకరణ సంస్థలు, కాంట్రాక్టర్లు ఈ ఇమెయిల్ ద్వారా సమస్యాత్మక ఫాస్టాగ్‎లను తక్షణమే గుర్తించనున్నాయి.

 

ఎప్పటి నుంచి అమలు

 

ఆ రిపోర్టులను పరిశీలించి, ఎన్‌హెచ్‌ఏఐ వెంటనే ఆ ఫాస్ట్‌ట్యాగ్‌లను నిషేధించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ విధానం ద్వారా టోల్ సేకరణ వ్యవస్థలో పారదర్శకత పెరగడానికి అవకాశం ఉంది. ఈ విధానం రానున్న కొత్త పథకాలైన యాన్యువల్ పాస్ సిస్టమ్, మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వంటి కార్యక్రమాల్లో భాగంగా అమలు కానుంది.

 

దేశంలో ఆగస్టు 15, 2025 నుంచి ఫాస్టాగ్‎ ఆధారిత యాన్యువల్ పాస్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే తెలిపారు. ఈ పాస్ ధర సంవత్సరానికి రూ.3,000. ఇది వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం రూపొందించబడింది. ఈ పాస్ యాక్టివేషన్ తేదీ నుంచి ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పుల వరకు, ఏది ముందు అయితే దానికి చెల్లుబాటవుతుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram