గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్ : రాయచూర్, కర్ణాటక:
సెల్ఫీ తీసుకుందామని చెప్పిన భార్య తన భర్తను నదిలోకి తోసేయడంతో గ్రామస్తుల సహాయంతో అతడు ప్రాణాలతో బయటపడిన ఉదంతం కలకలం రేపుతోంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం, ఓ దంపతులు ఇటీవల రాయచూర్‌లోని నదిపై ఉన్న వంతెన వద్దకు వెళ్లారు. అక్కడ భార్య, “మనిద్దరం ఒక సెల్ఫీ తీసుకుందాం” అని చెప్పింది. ఆమె సూచన మేరకు భర్త సెల్ఫీకి సిద్ధమవుతుండగా ఆమె అకస్మాత్తుగా అతడిని నదిలోకి తోసేసింది.
అయితే అదృష్టవశాత్తు, భర్త ఈత కొడుతూ కొంత దూరంలో ఉన్న ఒక పెద్ద రాయి వద్ద చిక్కుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ దృశ్యం అక్కడే ఉన్న స్థానికుల దృష్టికి రావడంతో వారు తాడును విసిరి అతడిని పైకి లాగి కాపాడారు.
స్థానికులు “ఎందుకు దూకావు?” అని అడగగా, బాధితుడు “నేను దూకలేదు, నా భార్యే నన్ను తోసేసింది” అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
ప్రస్తుతం సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, భార్య ఎందుకు ఈ దారుణ చర్యకు పాల్పడింది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.