ఇరిగేషన్ శాఖ మాజీ ఈ ఎన్ సి మురళీధర్ రావు అరెస్ట్

ఏకకాలంలో 11 చోట్ల ఏసీబీ దాడులు

14 గంటలపాటు నిరంతర సోదాలు

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్‌: నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ (ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌) మురళీధర్‌రావు అరెస్టయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మురళీధర్‌రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 11 చోట్ల తనిఖీలు జరిగాయి.

వివిధ పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించి భారీగా ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్ శివారులో 11 ఎకరాల భూమి, నాలుగు ఇళ్ల స్థలాలు, మోకిలలో 6,500గజాల స్థలం గుర్తించారు. కొండాపూర్‌లో విల్లా.. బంజారాహిల్స్, యూసఫ్‌గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. కరీంనగర్, హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాలు, జహీరాబాద్‌లో సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లను గుర్తించారు.

మురళీధర్‌రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్‌ నివేదిక తర్వాత మురళీధర్‌రావును ప్రభుత్వం తొలగించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram